‘అశోకుడు అలహాబాద్ శాసనం ద్వారా ధర్మమార్గాన్ని శాంతిమార్గాన్ని బోధించాడు…తరువాతి కాలంలో సముద్రగుప్తుడు అదే రాతి మీద ఇంకో శాసనం ద్వారా తాను చేసిన యుద్ధ వివరాలు తెలిపాడు……’
‘అశోకుడు……..తరువాతి కాలంలో……..యుద్ధం…….సముద్రగుప్తుడు…శాసనం’
‘అశోకుడు…..శాసనం’ అని చదివిందే మళ్ళీ చదువుతూ హిస్టరీ పుస్తకంతో కుస్తీపడతున్నాడు గోపాల్.
‘ఎన్నిసార్లు చెప్పాలిరా చదివింది అర్థం చేసుకోకుండా కంఠస్థం పడితే దేనికి పనికొస్తుంది’ అంటూ గోపాల్ వాళ్ళ అమ్మ ఊర్మిళ పాల గ్లాసు గోపాల్ కి అందించింది.
‘హిస్టరీలో అర్థం చేసుకునేది ఏముంటాదమ్మా రాజులు రాజ్యాల్ని ఎలా కోల్పోయారు….రాణులు ప్రాణ త్యాగం ఎందుకు చేశారు అనా?’ అంటూ ఒక్క నవ్వు నవ్వి మళ్ళీ చరిత్రలో మాత్రం ఉండే అశోక రాగం తీయడం మొదలుపెట్టాడు.
ఇదంతా వింటున్న సుందరం సోఫాలో వెనక్కి, ఆలోచనల్లో ముందుకి జారాడు.
ఎప్పుడూ చలాకీగా, ప్రశాంతంగా ఉండే తన భర్త ఈరోజెందుకు ఇలా మౌనంగా ఉన్నాడు? వారం క్రితం సుందరం వాళ్ళ అన్నయ్య దగ్గర నుండి వచ్చిన కబురు కాబోలు అనుకుంటూ, గోపాల్ ని లోపలికి వెళ్లి చదువుకోమన్నది ఊర్మిళ.
సుందరం పక్కన కూర్చుని టీ గ్లాసు చేతికి అందిస్తూ, ‘ధర్మరాజు వంటివాడికే ఆస్తి తగాదాలు తప్పలేదు మనం ఎంత చెప్పండి…మీరేం బాధపడొద్దు ఏమున్నా కలిసి చూసుకుందాం…’ అంది ఊర్మిళ.
తాగిన టీ గ్లాసు పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నాడు సుందరం…తన కొడుకు అన్న మాటలే గుర్తొస్తున్నాయి….
తన అన్న పంపిన నోటీసుని అప్పీల్ చేస్తూ వాళ్ళ నాన్నగారి ఆస్తి కోసం కోర్టుని ఆశ్రయించాడు సుందరం. సంవత్సరాలు గడిచాయి కానీ లాభం లేదు. కళ్ళు మూసి ఉన్న న్యాయదేవత ఒక్కసారైనా నా వైపు చూడకపోతుందా? అని ఇంకా ఇంకా వేచి చూశాడు సుందరం. లాయర్ ఫీజు మొదలుకుని , కోర్టు ఖర్చుల వరకు ఒకదానికి ఒకటి తోడు అయ్యి మొత్తానికి భార్య నగలు తాకట్టు పెట్టాల్సి వచ్చింది.
పూతీగలా నాజూకుగా ఉండే ఊర్మిళ మెడ గిల్టు పుస్తెలతో కూడా మెరిసిపోయింది, కానీ అంత అందాన్ని కూడా మళ్ళీ ఎప్పుడూ ముద్దాడలేకపోయాడు సుందరం…..ఊర్మిళ పరిస్థితికి కారణం తానే అనుకున్నాడో ఏంటో…
అదేదో సినిమాలో ‘పసివాడు పవన్ కళ్యాణ్ అయ్యాడు అన్నట్టు….’ పవన్ కళ్యాణ్ కాకపోయినా, సుందరం గారి పసివాడు పెద్దవాడయ్యాడు. నాన్నకి ఆస్తి బెంగ, భార్యకి భర్త ఆరోగ్యం మీద బెంగ, పట్టించుకునే నాథుడు లేక గోపాల్ అల్లరి చిల్లరగా తయారయ్యాడు.
చాలీచాలని జీతంతో చేసిన అప్పులు తీర్చలేక ఆరోగ్యం పాడైనా సరే, నిండా మునిగినవాడికి చలేంటి అన్నట్టు ఇంత దూరం వచ్చాక ఎలా వదిలేస్తాను? అనుకుని ఇంకా ముందుకి సంసారాన్ని, కోర్టు వాయిదాలని లాక్కుంటూ వచ్చాడు సుందరం.
పెద్దవాడైన గోపాల్ కి, వాళ్ళ నాన్న ఆస్తి కాకుండా అప్పులు ఇచ్చిన ఒక బాధ్యత లేని మనిషిగా మిగిలిపోయాడు. వీధి గొడవలు ఇంటి దాకా రావడం, అవి భార్యాభర్తల మధ్య దాంపత్యాన్ని కదిలించడం కనురెప్ప పాటులో అయిపోయింది. ఒకానొక సంఘటనలో అప్పుడే తీసిన వెన్నపూస లాంటి ఊర్మిళ చెంప మీద సుందరం చెయ్యి దురుసుగా పడటం వల్ల నీరైన ఊర్మిళ మనసు చూడాల్సి వచ్చింది.
టక్కున నిద్రలోంచి లేచాడు సుందరం. ఒళ్ళంతా చెమటలు పట్టాయి, చుట్టూ చూశాడు, తన భర్తకి లేచి ఉన్నప్పుడు ఎంతో ధైర్యం చెప్పిన ఊర్మిళ, సుందరం పడుకున్నాక బెంగతో చిన్నబుచ్చుకుని దిగులుపడటం చూశాడు.
ద్వాపర యుగం కాబట్టి ధర్మరాజు వంటివాడికి ఎంతో అన్యాయం జరిగితే తప్ప కోపం రాలేదు, అవ్వడానికి స్వభావంలో సుందరం ధర్మరాజు వంటివాడు అయినప్పటికీ… ఇది కలికాలం కనుక, అకారణంగా కోపం వచ్చుంటాది . తాను అలా అయిపోయాడు అనే ఆలోచన కలలో కూడా తనకి గిట్టలేదు.
ఊర్మిళని దగ్గరకి తీసుకుని గగనవీధిలో మేఘాలు కదిలినట్టు, ఊర్మిళ చెంప మీద ఉన్న ముంగురులని వెనక్కి జరిపి బుగ్గని నిమిరాడు (కలలో చేసిన తప్పు వలన కావచ్చు…) నుదుటి మీద ముద్దు పెట్టి ధైర్యం చెప్పాడు. గోపాల్ ని కూడా పిలిచి గుండెలకి హత్తుకున్నాడు. సుందరం చాలా మంచి మనిషి అయినా సరే, సడన్ గా ఇలా ప్రవర్తించడం చాలా వింతగా అనిపించింది ఇద్దరికీ.
సుందరం వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి, ‘నాకు కోర్టు కేసు వరకు వెళ్ళడం కరెక్ట్ అనిపించట్లేదు. ఏమున్నా మనం ఇద్దరం మాట్లాడుకుని దీన్ని సాల్వ్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. మనం తీసుకునే నిర్ణయాల వల్ల మన వాళ్ళు ఇబ్బందిపడటం ఎంత వరకు మంచిది? కోపంతో ఉన్నావు కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పినా నీకు నచ్చకపోవచ్చు. ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి నీ నిర్ణయం ఏంటో వారం రోజుల్లో తెలియచేయి.’ అన్నాడు.
ద్వాపరయుగంలోనే సూదిమొనంత నేల కూడా ఇవ్వడానికి ఇష్టపడని దుర్యోధనుడు కురుక్షేత్రానికి సిద్ధపడ్డాడు. కలికాలంలో కూర్చుని మాట్లాడుకునే అంత ఆస్కారం ఉంది అంటారా? ఏమో? వందల మంది సోదరులని తెగనరికిన అశోకుడు కూడా కళింగ యుద్ధం తర్వాత విరక్తితో యుద్ధాన్ని విరమించుకున్నాడు. యుద్ధభేరితో సాధించలేనిది, ధమ్మ మార్గంతో సాధించి రాజ్యాన్ని సుభిక్షంగా ఏకీకృతం చేసి సజావుగా పాలించాడు.
అంత గొప్ప జీవితసత్యాన్ని అశోకుడు ఒక శాసనం ద్వారా ప్రపంచానికి చెప్తే, అదే శాసనం మీద యుద్ధాన్ని కీర్తిస్తూ సముద్రగుప్తుడు ఇంకో శాసనం రాయించాడు. యుద్ధంలోనే కాదు, ప్రతి మనిషికి నిరంతరం ప్రతి విషయంలో, రెండు మార్గాలు ఎదురవుతాయి…. TO BE OR NOT TO BE.
నీ చెయ్యి ఎదుటివాడి చెంపవరకు వెళ్ళాలి అన్నా, ఒక హత్య జరగాలి అన్నా, ఒక పిల్లవాడు పరీక్షలో కాపీ కొట్టాలి అన్నా, ఒక కురుక్షేత్రం జరగాలి అన్నా, ఒక ప్రేమ పెళ్లి వరకు వెళ్ళాలి అన్నా….ప్రతిదానికి కర్మ స్వేచ్ఛే కారణం.
-------అనిమేష
No comments:
Post a Comment