Saturday, November 7, 2026

ఎంతమాత్రమున ఎవ్వరు తలచినా.. అంతమాత్రమే నీవు….

(కురుక్షేత్ర యుద్ధం ముందు, దుర్యోధనుడు ఇంకా అర్జునుడు, కృష్ణుడి సాయం కోసం తన ఇంటికి వెళ్తారు. అర్జునుడుకృష్ణుడి కాళ్ల దగ్గర కూర్చుంటే, దుర్యోధనుడు కృష్ణుడి తల దగ్గర కూర్చుంటాడు. నిద్రలోంచి లేచిన కృష్ణుడు ముందుతన కాళ్ల దగ్గరున్న అర్జునుడిని చూశాడు కాబట్టి ముందు తనిని అడుగుతాడు ‘యుద్ధం చేయకపోయినా నేను నీతోఉండటం కావాలా లేదా యుద్ధం చేసే నా సైన్యం మొత్తం కావాలా?’ అని. యుద్ధం చేయకపోయినా పర్వాలేదు కానీనాకు నువ్వే కావాలి అంటాడు అర్జునుడు.

 

మహాభారతంలో ఈ ఘట్టం నాకు చాలా ఇష్టమైనది ఇంకా నన్ను ఎప్పుడు కదిలిస్తూ, కష్ట కాలంలో తోడుంటూ ధైర్యంఇస్తాది. ఇదే పరిస్థితిలో కృష్ణుడి పట్టపురాణులు రుక్మిణి ఇంకా సత్యభామ ఉంటే ఎలా ఉంటుంది అన్న చిలిపిఆలోచన లోంచి పుట్టిందే ఈ కథ. Note: ఈ కథ పూర్తిగా కల్పితం మాత్రమ.  ఎవరినీ నొప్పించే ఉద్దేశంతో రాసిందికాదు. గమనించగలరు.)

 

———

 

అప్పటి వరకు సరదాగా ముచ్చటించుకున్న రుక్మిణి సత్యభామలు, కృష్ణుడి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అవ్వడానికి దేవతా మూర్తులు అయినా, స్త్రీ మూర్తులు కాబట్టి భర్త ప్రేమ ఎప్పుడూ మనసుని కదిలిస్తూనే ఉంటుంది ఏమో. ఇద్దరిలో ఎవరికి కృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టం అనే విషయం మీద చర్చించి…..చించి …., ఆఖరికి కృష్ణుడి దగ్గరకే వెళ్లి తేల్చుకుందాం అనుకున్నారు.

 

రంగుమంచాన సేదతీరుతున్న కన్నయ్య అస్సలు ఏమీ ఎరగనట్టు ఉన్నాడు. ఆత్మాభిమానం ఎక్కువ ఉన్న మన సత్యభామ కృష్ణుడి తల దగ్గర కూర్చుంది, రుక్మిణి కృష్ణుడి ఎర్రటి పాదాలకి ముగ్ధురాలై అక్కడే కూర్చుండిపోయింది. తన ప్రేమను ఆపుకోలేక ఆ ఎర్రని పాదాలని రుక్మిణి ముట్టుకున్న వెంటనే మెలకువలోకి వచ్చాడు. చిన్నబోయిన తన రాణుల మొహం చూసి ‘ఏంటి సంగతి’ అని అడిగాడు.

 

‘నువ్వే చెప్పు స్వామి రుక్మిణికి నువ్వంటే ఎక్కువ ఇష్టమా లేదా నాకు నువ్వంటే ఎక్కువ ఇష్టమా’ అని అడిగింది సత్య. మళ్ళీ మొదలైందిరా బాబు వీళ్ళ గొడవ అనుకుని తల పట్టుకున్నాడు కన్నయ్య. ఎన్నో రాక్షస సంహారాలు చేసిన పరమాత్మునికి కూడా ఇంట్లో ఈ వేదన ఇబ్బందిగానే ఉంది పాపం. ‘ద్వాపర యుగంలో మొదలైంది మీ గొడవ, తులాభారం నుండి పారిజాతాపహరణం వరకు నడిచినా కలికాలం వచ్చినా కూడా మీ ప్రశ్నలు ఆగలేదా?’ అని నవ్వుకున్నాడు.

 

‘నా ఇంటి వారిని సైతం వదులుకుని వచ్చిన నాకే మీరంటే ఎక్కువ ఇష్టం కదా స్వామి….’ అంది రుక్మిణి.

 

‘ఏమీ కాదు, అవడానికి రాక్షసుడు అయినా సరే గత జన్మలో నా కొడుకు అయిన నరకాసురుడిని స్వామి కోసం సంహరించాను….కాబట్టి నాకే స్వామి అంటే ఎక్కువ ఇష్టం’ అంది సత్య వయ్యారంగా మొహం తిప్పుకుంటూ.

 

ఈ గొడవకి ఈరోజుటితో ఎండ్ కార్డ్ వేయాలనుకున్న కృష్ణుడు ‘సరే మీ ఇద్దరికి ఒక పోటీ పెడతాను అందులో ఎవరు నన్ను మెప్పించి గెలిస్తే వాళ్లకే నేను ఎక్కువ ఇష్టం అన్నట్టు’ అన్నాడు కన్నయ్య.

 

‘ఏంటి స్వామి అది’ అని ముక్తకంఠంతో అడిగారు ఇద్దరు.

 

‘నా మీద మీకున్న ప్రేమను ఎవరైతే ప్రతిరూపంగా చూపగలరో వాళ్ళకి నేను ఎక్కువ ఇష్టం..’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

 

‘ఈ ప్రశ్నని ఎలా చేదించాలి…..ప్రేమకి ప్రతిరూపంగా ఏం చూపగలం’ అని రుక్మిణి సత్యతో అడగగా ..

 

‘ఇద్దరం ఒకే కొలమానం మీద ఈ పోటీ లో పాల్గొని ఆయన రూపమే ప్రేమకి ప్రతిరూపంగా చూపిద్దాం’ అన్నది సత్య.

ఎవరి అంతఃపురానికి వాళ్ళు చేరుకున్నారు.

———

తన పరిచారికలతో కూర్చుని ఆలోచిస్తుంది సత్య. అకస్మాత్తుగా ఒక ఆలోచన తట్టింది సత్యకి. ‘నేను సత్రాజిత్ మహారాజు కుమర్తెని కదా….ఈ భూమండలం మీదే శుద్ధమైన బంగారంతో నా స్వామి విగ్రహాన్ని తయారు చేసి, ముల్లోకాల్లో ఉన్న అమూల్యమైన మణులతో అలంకరిస్తాను’ అంది ఎంతో కుతూహలంతో.

 

‘తల్లి….శ్రీకృష్ణ తులాభారం అప్పుడు కూడా ఇలాగే బంగారంతో తూగని కృష్ణయ్య, రుక్మిణి ప్రేమతో వేసిన తులసి దళానికి తేలిపోయాడు. మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారేమో చూసుకోండి…’ అంది నవ్వుతూ అక్కడ ఉన్న ఒక దాసి.

 

ఆశలన్నీ నీరు కారిపోయి నిజమే కదా అని చిన్నబోయింది సత్య. ఎంతో ఆలోచించి ‘నేను ఈ భూదేవి ప్రతిరూపాన్ని కాబట్టి, భూమిలో ఉన్న ఎంతో సారమైన మట్టితో పవిత్ర నదీ జలాలు అన్నీ కలిపి, హిమాలయ పర్వతాల వొంపులు దిద్ది స్వామి విగ్రహాన్ని తయారు చేస్తాను’ అంది సత్య.

 

‘అద్భుతంగా ఉంది దేవి…కానీ అలంకరణకి ఏం చేద్దాం’ అన్నాడు చుట్టూ ఉన్నవాళ్లంతా .

 

‘ఒకసారి పారిజాత పుష్పం కోసం నా అలకని తీర్చడానికి, ఇంద్రుడితో యుద్ధం చేసి ఏకంగా పారిజాత వృక్షాన్నే నాకోసం తీసుకొచ్చారు నా స్వామి. అందుకే ఆ పుష్పాల తోనే అలంకరిస్తాను’ అంది మురిసిపోతూ సత్య.

చకా చకా పనిలో పడిపోయారు అంతా…..

——

 

ఒక మనిషి మీద ఉన్న ప్రేమకి ప్రతిరూపాన్ని ఎలా చూపించాలి? అని ఆలోచిస్తూ అటు ఇటు నడుస్తుంది రుక్మిణి. సహజంగానే స్వామి మీద అమితమైన ప్రేమ, భక్తి ఉన్న రుక్మిణి తన అమితమైన ప్రేమను ఎలా చూపగలదు? టక్కుమని ఏదో తట్టింది రుక్మిణికి.

 

‘ఎంత దేవతా మూర్తి అయినా తన భర్త ఇంకొక స్త్రీని ఇష్టపడటాన్ని జీర్ణించుకోలేదేమో ఒక స్త్రీ. అలాంటిది నా భర్త మీద ఉన్న ప్రేమను ప్రతిరూపంగా చూపించాలంటే ఆయనకి ఉన్న ప్రేమే ఒక రూపం దాల్చాలి…..’ అంది రుక్మిణి.

 

ఏమీ అర్థం కాకపోవడంతో అయోమయంగా చూశారు దాసీలు అంతా.

 

‘కృష్ణుడి ప్రేమకి అతి శుద్ధ రూపం రాధ…..కాబట్టి నేను కృష్ణుడి భార్యని అయినప్పటికీ వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను మూర్తీభవిద్దాం అనుకుంటున్నాను…..కానీ అందులో నా ప్రేమ కూడా ఇమిడేలా, ఏ తులసి దళానికైతే నా స్వామి ఉప్పొంగి నా ప్రేమను గుర్తించారో ఆ తులసి దళాలతో వారిని తయారుచేస్తాను’ అంది రుక్మిణి.

 

రుక్మిణి నిస్వార్థమైన ప్రేమకి అందరూ ఆశ్చర్యపోయారు.

 

అందులో ఒక దాసి, సత్యభామ ఎలా తయారుచేస్తుందో చూడడానికి తన అంతఃపురానికి వెళ్ళడానికి ప్రయత్నించింది. ఎక్కడ తను చూస్తే వారి కంటే మంచి విగ్రహాన్ని తయారుచేస్తారేమో అని తలుపులు మూసేసారు సత్య పరిచారికలు అంతా.

 

భూమండలం మీద అతి ఉత్తమమైన తులసి దళాలతో, తీగలతో అందమైన రాధా కృష్ణుల రూపాన్ని తయారుచేసింది రుక్మిణి. ధనురాసనం వేసి చూస్తేనే కానీ స్వామి మొహం కనిపించనంత ఎత్తు ఉంది ఆ రూపం. అలంకరణకి ఏం చేయాలి అని ఆలోచిస్తూ స్వామితో తనకున్న జ్ఞాపకాల్లోకి జారుకుంది…..

 

‘నేను తనని ఎప్పుడూ చూడకపోయినా సరే, నేను ప్రేమించాను అన్న ఒక్క కారణంతో నా అన్న రుక్మి, చేది రాజైన శిశుపాలుడి ద్వంద్వ సైన్యాలను ఓడించి మరీ నన్ను పెళ్లాడాడు. కాబట్టి ఆయన వీరత్వానికి ప్రతీకగా ఒక ఖడ్గాన్ని చేతిలో పెడతాను. అలాగే అంత యుద్ధంలో కూడా నేను అడిగా అన్న ఒక్క కారణంతో తన సోదరుడు రుక్మికి ప్రాణభిక్ష పెట్టాడు కాబట్టి తనలో ఉన్న ఆ సహనానికి, ప్రేమకి ప్రతీకగా ఒక తెల్లటి పావురాన్ని తన భజం మీద పెట్టి అలంకరిస్తాను.’

‘నా స్వామి ఎంత వీరపురుషుడో అంతే సౌమ్యుడు కూడా అని ఒకేసారి చూపిస్తాను’ అంది రుక్మిణి.

 

ఎంతో అద్భుతంగా వచ్చాయి రెండు మూర్తులు కూడా. 

‘నీలో ఒక భాగాన్ని ఆయన ప్రేమకి రూపంగా చూపించావు ఎంతో బాగుంది నువ్వు చేసిన విగ్రహం…నిజంగా నీకే స్వామి అంటే ఎక్కువ ఇష్టమేమో’ అంది రుక్మిణి సత్య భుజంపై వాలుతూ.

 

‘నాకు కాకుండా నీకు పారిజాతం ఇస్తేనే అలిగాను నేను. అలాంటిది కృష్ణుడు అంటేనే రాధ అని తెలుసుకుని దాన్ని అంగీకరించిన నీకన్నా నిస్వార్థమైన ప్రేమ లేదు రుక్మిణి’ అంది సత్య.

ఇద్దరు ఇలా మాటల్లో ఉండగా మన కొంటె కన్నయ్య వచ్చాడు.

 

‘చెప్పండి స్వామి ఎవరు మిమ్మల్ని మెప్పించారు ఎవరికి ఈ సమస్త సృష్టిలో మీ మీద అమితమైన ప్రేమ ఉంది అంటారు?’ అన్నారు ఇద్దరు.

 

కృష్ణుడు చిరునవ్వుతో ‘మీ ఇద్దరికి నేను అంటే చాలా ఇష్టమే …కానీ మీకన్నా నా మీద ఎంతో ప్రేమను కలిగి వేరే వారు ఉన్నారు. వాళ్ళకి నేను అంటే అమితమైన ప్రేమ’ అన్నాడు.

ఇంత కష్టపడి ఎంతో ఆలోచించి వీరు చేసిన పని అంత వృధా నా ? ఒకపక్క బాధ, ఇంకోపక్క కోపంతో అడిగారు “ఎవరు స్వామి వాళ్ళు” అని

 

‘మీరిద్దరు నన్ను కేవలం మీకు నా మీద ఉన్న ప్రేమకి ప్రతిరూపంగా చూశారు.  కానీ …. 

గంగా నదిలో నీరే దాని చుట్టూ ఉన్న ఊట బావుల్లో, నూతిలో అనేక రూపాలుగా ఎలా కనిపిస్తుందో…… అలాగే నేను కూడా ఏ రూపంలో తలిస్తే ఆ రూపంలో కనిపిస్తాను అంటూ అన్నమయ్య కీర్తించి, దాదాపు 36,000 కీర్తనలు నా గురించి రాసి ఎందరో భక్తులను ఆనందపరిచాడు’

‘ఒక మనిషికి కష్టం వస్తే వెంటనే గుర్తువచ్చేది అమ్మ తర్వాత దేవుడు. అమ్మప్రేమకి దూరమైన పిల్లలకు కూడా నేను ఉన్నాను. కానీ కుల వివక్షతతో నా నుండి ఎందరో భక్తులని , నా ఆలయాలకి దూరం చేశారు. అలాంటివారికి కూడా ఊరటనిస్తూ, రాజా రవి వర్మ సామాన్యులకి సైతం నా చిత్రాన్ని అందేలా ఎంతో పాటుపడ్డాడు’

 

‘నన్ను శైవ రూపంలో కొలవాలా లేదా విష్ణువుగా కీర్తించాలా అని దెబ్బలాడుకునే వారందరినీ ఒక మార్గంలో నడిపించడానికి ఎంతో పాటుపడి ఇద్దరికి భేదం లేదు అని తెలియజేస్తూ, తన రచనలను హరిహరనాథ (హరి-విష్ణువు; హర-శివుడు) రూపానికి అంకితం ఇచ్చాడు….తిక్కన కవి’

‘ఒకరు చేసిన బొమ్మని ఇంకొకరు చూస్తేనే కష్టమవుతుంది అనుకున్నారు, తల ఎత్తి చూసినా సరే కనిపించనంత ఎత్తు విగ్రహాన్ని తయారుచేసారు….కానీ బాలుడైన వామనుడినుండి, విశ్వరూపాన్ని సైతం ఒకేలా కొలిచే భక్తులు ఉన్నారు’

 

‘కలికాలం ఎన్నో చెడు సహవాసాలు చుట్టూ చేరినా, ఎన్నో కష్టాలు వచ్చినా సరే, నా మీద ఉన్న నమ్మాకాన్ని వదలకుండా, ధర్మ మార్గాన్ని విడవకుండా, ముందుకు సాగుతూ అప్పటి ప్రహ్లాదుడిని సైతం తలపిస్తున్న భక్తులు ఎంతోమంది ఉన్నారు…..’


‘మీ కళ్ల ముందే తిరుగుతున్న నన్ను నమ్మడం వేరు, నా  స్వరూపాన్ని ఎప్పుడూ నిజంగా చూడకపోయినా సరే నేను వాళ్ళకి ఉన్నాను అన్న నమ్మకంతో ధర్మాన్ని తప్పని వారి కన్నా మీ ప్రేమ గొప్పదా?’ అని అడిగాడు పరమాత్మ.

రాణులద్దరికి మాట పెగలలేదు. వారెంత అల్పంగా స్వార్థమైన ప్రేమని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారో అనిపించింది.

రెండు చేతులు జోడించి ‘పారి పరి విధముల నానా రూపాలలో నిన్ను కొలిచే భక్తులు గొప్ప కాదు స్వామి, ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలోకి నిస్సందేహంగా ఇమిడి వారికి మోక్షాన్ని ఇస్తున్నావు అందుకే నువ్వు నిజంగా సర్వాంతర్యామివి’ అని నమస్కరించారు.

 

———— అనిమేష


ఎంతమాత్రమున ఎవ్వరు తలచినా.. అంతమాత్రమే నీవు….

( కురుక్షేత్ర   యుద్ధం   ముందు ,  దుర్యోధనుడు   ఇంకా   అర్జునుడు ,   కృష్ణుడి   సాయం   కోసం   తన   ఇంటికి   వెళ్తారు .  అర్జునుడుకృష్ణుడి   ...