ఉలిక్కిపడి నిద్రలోంచి లేచాడు భార్గవ్…..చాలా చిరాకుతో గిర్రున తిరుగుతున్న తల పట్టుకుని కూర్చున్నాడు. ఆలోచనలు ఉప్పెనలా ముంచెత్తుకు వచ్చాయి. బ్యాంక్ నుంచి తెచ్చిన లోన్, అమ్మ నాన్న ఇచ్చిన మరికొంత డబ్బులు సాయంతో, తన స్నేహితుడితో కలిసి వ్యాపారం పెట్టి రూపాయి రూపాయి దాచి లోన్స్ అన్నీ క్లియర్ చేసి ఇంట్లో వాళ్ళని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చాడు.
మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిన వాళ్ళ వ్యాపారాన్ని, భార్గవ్ కి వచ్చిన ఒక కష్ట కాలంలో తన స్నేహితుడే లక్ష్మీ దేవి ఆకర్షితుడై మోసం చేసి భార్గవ్ వాటాని చాలా తక్కువ ధరకే చేజిక్కించుకున్న విషయం గుర్తొచ్చింది.
ఒళ్ళంతా మండిపోయి ఒక్కసారిగా వచ్చిన కోపానికి చెయ్యిని పక్కనే ఉన్న గోడకి వేసి కొట్టాలనిపించింది. కానీ, డాక్టర్ బిల్ ఇంకా చెయ్యి నొప్పి గుర్తొచ్చి ఆత్మహాని విరమించుకున్నాడు. ఒక మెత్తని దిండుని మాత్రం విసిరికొట్టాడు పాపం దిండుకి నొప్పి వేయదు అనేమో!!!!
గడియారం వైపు చూశాడు, టైమ్ పదకొండు కావొస్తుంది ఆలోచనలో అర్ధగంట స్వాహా!!! సర్లే చేసేదేముంది అనుకుని మంచం మీద నుండి లేచి ఫ్రెష్ అయ్యి ఆకలితో కిచెన్ లోకి వచ్చాడు. టేబుల్ మీద హాట్ప్యాక్ చూసి అబ్బా మా ఆవిడ ఈరోజు పూరీ చేసిందా లేక బజ్జీ చేసిందా అని మురిసిపోయి హాట్ప్యాక్ పైకి తీస్తే, శ్రీకృష్ణ తులాభారంలో తులసీదళానికి తేలిపోయిన కృష్ణయ్యలా హాట్ప్యాక్ సులువుగా తేలిపోయింది ….ఖాళీగా ఉండటం వల్ల ఏమో.
కింద చిన్న పేపర్ మీద ‘అర్జెంట్‌గా ఆఫీస్ లో మీటింగ్ ఉండటం వల్ల నీకు చేసిన ఉప్మా కూడా నా లంచ్ బాక్స్ కి పెట్టుకుని వెళ్ళిపోతున్నా, ఈరోజుకి ఏదోకటి కొని తెచ్చుకో. సాయంత్రం నేను వచ్చాక నీకిష్టమైన పకోడీ వేసిపెడతా కదూ……
I love you and I miss you కన్నా’
అని వాళ్ళ ఆవిడ సుచి రాసిపెట్టింది. పదకొండింటికి ఏ హోటల్ నాకు టిఫిన్ పెడతాది అనుకుంటూ క్షుద్బాధతో కోపం వచ్చినా సరే, సుచి నవ్వు గుర్తొచ్చి కోపం కంట్రోల్ చేసుకున్నాడు భార్గవ్.
కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది, తీసి చూస్తే ఒక బుట్టలో రెండు డబ్బాలు పట్టుకుని వాళ్ళ పక్కింటి పాప వచ్చింది. ‘ఈరోజు నా పుట్టినరోజు, ఈ పెసరట్టు ఉప్మా నాకు చాలా ఇష్టమని మా అమ్మ చేసింది….మీక్కుడా ఇచ్చి రమ్మంది అంకుల్’ అంది శరణ్య. చిన్న పాపే అన్నపూర్ణగా వచ్చింది అని సంతోషపడినా……అంకుల్ అన్నందుకు కొంచెం నొచ్చుకున్నాడు. ‘హ్యాపీ బర్త్‌డే శరూ….’ అని దగ్గరకి తీసుకుని ఒక పెన్ గిఫ్ట్ ఇచ్చాడు.
‘లేట్ గా ఇచ్చాము అని తప్పుగా అనుకోవద్దు అని చెప్పమంది అమ్మ’ అంది నవ్వుతూ శరణ్య.
‘అదేం లేదు నేను కూడా ఇప్పుడేగా నిద్రలేచాను, థాంక్స్ అగేన్’ అన్నాడు భార్గవ్.
‘అదేంటి నువ్ పనికి వెళ్ళవా?? అంత లేట్ గా నిద్రలేస్తే సుచి అక్క ఏమనదా? మా అమ్మ అయితే నాన్నని ఆఫీస్ కి ఎంత కంగారుపెడతాదో…..’ అంటూ ఇచ్చిన పెన్ ని పది సార్లు అటూ ఇటూ తిప్పి చూసింది.
బిజినెస్ దెబ్బతిన్నాక సంవత్సరం పాటు ఇంట్లోనే ఉండిపోయిన భార్గవ్ కి ఈ ప్రశ్నలు చిరాకు తెప్పించాయి…..దానికి తోడు తనని అంకుల్ అని పిలిచి, తన భార్యని అక్క అనడం ఇంకా విసిగించింది. కానీ చిన్నపిల్ల కదా ఏం చేస్తాడు అని నవ్వేసి పంపేశాడు.
బాక్స్ ఓపెన్ చేయగానే పెసరట్టు విత్ ఉప్మా ఘుమాయించింది. ఒక్క ముక్క నోట్లో పెట్టుకోగానే ఆ నల భీముడు స్త్రీ రూపం దాల్చి చేసినంత అద్భుతంగా అనిపించింది. టిఫిన్ కి ఒక ఫోటో తీసి ‘నీ ఉప్మా తీసుకెళ్ళిపోతేనేం? మీ కృష్ణయ్య నాకోసం పెసరట్టు పంపాడు’ అని సుచి కి పంపించాడు ఆ ఫోటో.
ఇంకో చేతిలోకి చరవాణి చేరిందిగా, టిఫిన్ చేస్తూ రీల్స్ చూడటం మొదలు…. అర్ధనగ్నంగా నర్తిస్తున్న కన్నెపిల్లలు, నన్ను అంటే నన్ను కొను అని పోటీపడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థ ని విలయ తాండవం చేయిస్తున్న బట్టలు, వాచ్ లు , చెప్పులు. అవి చూసి విసుగొచ్చి ఫోన్ పక్కన పెట్టేస్తుండగా స్పష్టమైన తెలుగులో ఎవరో మహానుభావుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఏదో చెప్తున్నారు. ఇదే లాస్ట్ రీల్ ఇంక అడిక్ట్ అవ్వకూడదు అనుకుని చూస్తున్నాడు భార్గవ్.
Reel:
ఇద్దరు బాటసారులు అడవిలో వెళ్తుండగా ఒక మనిషి ఆకలితో కనిపించాడు అంట. ఒక బాటసారి దగ్గర 3 చపాతీ లు ఉంటే ఇంకొకరి దగ్గర 5 ఉన్నాయి. ఆకలితో ఉన్న మనుషులు ముగ్గురు ఉన్నారు కాబట్టి మొత్తం ఉన్న 8 చపాతీలని ఏకం చేసి, ఒక్కో చపాతీ ని 3 ముక్కలు అంటే మొత్తం 24 ముక్కలు చేసి తిరిగి సమానంగా పంచుకున్నారు. అంటే ఒక్కొక్కళ్ళకి 8 ముక్కలు వచ్చినట్టు.
అందరూ భోజనం చేశాక ఆకలితో ఉన్న వ్యక్తి తన దగ్గరున్న 8 బంగారు నాణాలని బాటసారులకి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక్కడే ఒక చిక్కు మొదలైంది. ఇప్పుడు ఆ బంగారు నాణాలని ఇద్దరూ సమానంగా తలకో నాలుగు పంచుకోవాలా? లేక 3 చపాతీ లు ఇచ్చిన బాటసారికి 3 నాణాలు, 5 చపాతీ లని ఇచ్చిన బాటసారికి 5 నాణాలు పంచుకోవాలా? దెబ్బలాట తన్నులాటగా మారేలోగా ఇద్దరూ రాజుగారి దగ్గరకి న్యాయం కోసం వెళ్ళి జరిగింది వివరించారు.
ఆ బంగారు నాణాలని అక్కడ పెట్టి తీర్పు కోసం మరుసటి రోజు రమ్మన్నారు రాజుగారు. మరునాడు ఇద్దరు బాటసారులు తీర్పు కోసం రాజు గారి దగ్గరకి వెళ్ళగా, 3 చపాతీ లు తెచ్చిన బాటసారికి ఒక నాణెం, 5 చపాతీ లు తెచ్చిన బాటసారికి ఏడు నాణాలు ఇవ్వాలని తీర్పునిచ్చారు. ఇదేం దిక్కుమాలిన న్యాయం రా నాయనా అనవసరంగా రాజు దగ్గరకి వచ్చా అని మొదటి బాటసారి తలకొట్టుకోగా…..నిన్న రాత్రి భగవంతుడు నా కలలోకి వచ్చి ఈ న్యాయాన్ని చెప్పాడు అని రాజుగారు చెప్పారు.
‘3 చపాతీ లు అంటే 9 ముక్కలు తన దగ్గర ఉంటే అందులో 8 బాటసారి తిని, 1 ముక్క ఆకలితో ఉన్న మనిషి కోసం త్యాగం చేశాడు. కానీ రెండవ బాటసారి, తన దగ్గరున్న 5 చపాతీ లు అంటే 15 ముక్కలు ఉంటే, 7 దానం చేసి 8 తాను తిన్నాడు అందుకే మొదటి బాటసారికి 1 నాణెం రెండవ బాటసారికి 7 నాణాలు’ అన్నారు రాజుగారు.
తీర్పు విన్న జనం అంతా నివ్వెరపోయారు.
రీల్ చూసిన భార్గవ్ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. పక్కనే టేబుల్ మీద ఉన్న పేపర్ చూస్తే ఎవరో తెలిసిన వ్యక్తి లా అనిపించింది. పేపర్ తెరిచి చూసాడు, ‘నష్టాలతో దివాలా తీసిన #$%%^# కంపెనీ, పరారీలో ఉన్న యజమాని, గాలిస్తున్న పోలీస్ బృందం’ అన్న హెడ్‌లైన్స్ కింద తన స్నేహితుడి ఫోటో.
తన స్నేహితుడితో ఉండుంటే ఈరోజు భార్గవ్ కూడా అదే పరిస్థితిలో ఉండేవాడేమో. కానీ జరిగిన మోసం వల్ల భార్గవ్ వాటా తనకి దక్కింది. అదీ లెక్క!!!!! అదీ…..దేవుడి లెక్క!!!! అనుకుని నవ్వుకున్నాడు. వెంటనే లేచి, ‘నేను బాగా ఆలోచించాను, మనం త్వరలోనే కొత్త బిజినెస్ పెట్టబోతున్నాం. సాయంత్రం నువ్వు చేసిన పకోడీలు తింటూ మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. I love you సుచి’ అని మెసేజ్ పెట్టాడు తన భార్యకి.
మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వడం దేవుడి లెక్క అయితే, ఒక చోట పడిపోతే లేచి నిలబడటం మన లెక్క అవ్వాలి.
——— Animesha
No comments:
Post a Comment