Wednesday, November 4, 2026

గగనవీధిలో విహంగ వీక్షణం

బాబాయ్ ట్రావెల్ స్క్రాప్ బుక్ ముందేసుకుని పేచీపెడుతున్నాడు చిన్ను. ఒకపక్క కొడుక్కి బ్యాగ్ సర్దుతూ ఇంకో పక్క మనవడ్ని ఊర్కోపెడుతుంది చిన్ను వాళ్ల నానమ్మ. ఎంత ఊర్కోపెడితే ఏం లాభం, జనరల్ కంపార్ట్‌మెంట్లో టీ సీ లా పట్టిందే పట్టు అన్నట్టు గొడవ చేస్తున్నాడు చిన్ను…..తనని కూడా వెంట తీస్కెళ్లమని.

‘రేయ్ వీడు నా మాట వినట్లేదు, నువ్వొకసారి వచ్చి చెప్పచ్చు కదా’ అంది చిన్ను వాళ్ల నానమ్మ చిన్న కొడుకుని పిలుస్తూ.

‘చిన్ను కన్నా నీకు మొన్న చెప్పా కదా…నువ్వు ఇంకొంచెం పెద్ద అయ్యాక ఇద్దరం ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్దాం అని…’ అంటూ చిన్నుని దగ్గరకి తీసుకుని బుజ్జగించాడు.

కళ్లు తుడుచుకుంటూ ‘నేను ఇంకొంచెం పెద్దవాడిని అయితే…నువ్వు ఇంకా ఎక్కువ పెద్దవాడివి అయిపోతావ్…..మొన్నే వాటర్ క్యాన్ ఎత్తుతూ నడుం నొప్పి అని రెండు రోజులు బాధపడ్డావ్...…’ అంటూ రాగాలు తీసాడు.

పక్కనే ఉన్న చిన్ను వాళ్ల అమ్మ ఆ మాటలకి టక్కున నవ్వేసింది. వరసకి మరిది అయినా, వయసులో పెద్దవాడు అయినా సరే తన సొంత తమ్ముడిలానే ఫీల్ అయ్యేది ఇందిర. వదిన నవ్వుకి సిగ్గేసింది. ఇదంతా వింటున్న చిన్ను వాళ్ల నాన్న గదిలోంచి బయటికి వచ్చి ‘రేయ్ స్కూల్ మానేసి ఏంటి నీ వేషాలు!!! సమ్మర్ హాలిడేస్ కి నిన్ను ఊరు తీస్కెళ్తా ఇప్పుడు పేచీ ఆపు’ అని సౌమ్యంగా కొడుకుని మందలించాడు రాఘవ.

అమ్మ, బాబాయ్ కి లొంగని చిన్ను, నాన్న మాటలకి కొంచెం తగ్గాడండో . చిన్నబుచ్చుకున్న మొహంతోనే జపాన్ నుండి ఏం కావాలో పెద్ద లిస్ట్ రాసి బాబాయ్ కి ఇచ్చాడు చిన్ను.


-——-


క్యాబ్ లో కూర్చుని తాను తయారు చేసుకున్న ట్రావెల్ స్క్రాప్ బుక్ చూస్తూ స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు….కాలు ఎప్పుడూ ఒక చోట నిలబడదుగా…. భారతదేశాన్ని చుట్టేసి ప్రపంచం మీద పడి పోగేసుకున్న అనుభూతులు ఎన్నో…ఫ్రీ బఫే లో భోజనం చేస్తున్న చుట్టంలా, ఎన్ని దేశాలు తిరిగినా, ఆశ తీరదు. ఇంకా ఏదో చూడాలి, ఏవో తెలుసుకోవాలి. సగం ఖాళీ ఉన్న పుస్తకాన్ని కూడా ఇంకొన్ని మెమరీస్ తో నింపేయాలి కానీ ఈసారి నుండి జంటగా. హార్న్ సౌండ్స్ కి ఉలిక్కిపడ్డాడు. ఎయిర్‌పోర్ట్ రాగానే లోపలికి పరుగులు తీసాడు.

‘లాస్ట్ కాల్ ఫర్ గౌ……’ అని అనౌన్స్‌మెంట్ ని బ్రేక్ చేస్తూ మన హీరో గారు బోర్డింగ్ పాస్ టేబుల్ మీద పెట్టి ‘గౌతమ్… గౌతమ్ అనంతరాజ్ సారీ ఫర్ ద డిలే’ అని చెక్-ఇన్ ఆఫీసర్ కళ్లలోకి చూస్తూ అన్నాడు.

 ‘అట్లాంటిక్ మహాసముద్రాన్ని సగం చేసి రెండు గాజు గిన్నెల్లో పోస్తే ఎలా ఉంటాదో అలా ఉన్నాయి ఈమె కళ్లు’ అనుకున్నాడు. ‘హియర్ ఈజ్ యువర్ బోర్డింగ్ పాస్ సర్ థ్యాంక్యూ’ అంటూ నవ్వింది. నేమ్‌ప్లేట్ మీదున్న పేరు చూడడానికి ట్రై చేసాడు ….ఈలోగానే వెనక నుండి ఎవరో తన పాస్ ఇస్తూ ‘మైనా కొలనుపూడి….ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు గెట్ ఎ విండో సీట్…’ అన్నారు. ఎవరబ్బా అని తిరిగి చూద్దాం అనుకున్నా ఫ్లైట్ మిస్ అవుతాది అన్న కంగారులో గౌతమ్ తన బ్యాగ్ తీసుకుని బయల్దేరాడు.

చిన్ను ఇచ్చిన లిస్ట్ చూస్తూ నవ్వుకుంటుండగా మైనా వచ్చి తన పక్కన కూర్చుంది. బ్రహ్మ దేవుడు తన భార్య ఉద్యానవనానికి మాత్రమే సృష్టించిన ఒక పూమొక్క యొక్క పూరేకు జారి భూమి మీద పడితే వచ్చే లాంటి సువాసన తనని కమ్మేసింది. అది చాలా కొత్తగా, మత్తుగా ఉంది. పక్కకి తిరిగి చూసాడు. మొహం సరిగ్గా కనపడకపోయినా, చిన్నప్పుడు జియోగ్రఫీ లెసన్ లో ‘తూర్పువైపు చూస్తూ తూర్పు కనుమలు, పశ్చిమాన పశ్చిమ కనుమలు, మధ్య దక్కన్ పీఠభూములు ఉంటాయి…’అని చదివిన పాఠాన్ని తలపించేలా ఒక అమ్మాయి తన లగేజ్ సర్దుకుంటుంది. తప్పని తెలిసినా, ఆ అందానికి ముగ్ధుడు అయిపోయాడు గౌతమ్.

ఒక్కసారిగా ‘ఎక్స్క్యూజ్ మీ’ అన్న మాట విని కొంచెం బెదిరాడు. తను చూడడం చూసుంటాదా? నాగురించి ఎంత చీప్ గా అనుకుంటుంది? ఇప్పుడేమైనా గొడవ అవుతుందా? ఒక్క క్షణంలో వంద ప్రశ్నలు గౌతమ్ తలని తిప్పాయి. ధైర్యం తెచ్చుకుని ‘ఐ..యామ్..సార్…’ అనేలోగానే, ‘మీరు నా సీట్ లో కూర్చున్నారు’ అంటూ మైనా తన విండో సీట్ తీసుకుంది. విండో పైన తల వాల్చి ఆలోచనల్లో మునిగింది మైనా. ‘ఎర్లీ రిటైర్మెంట్ తీసుకుని తప్పు చేస్తున్నానా….అసల ఈ బిజినెస్ ఐడియా కరెక్టా?’ ఇంకా లక్ష ప్రశ్నలు లక్ష తొంబై గొడవలు గురించి ఆలోచిస్తుంది.

అందాన్ని ఆస్వాదించడానికే పుట్టిన మన్మధుడిలా గౌతమ్ చూసీ చూడనట్టు మైనా నే చూస్తున్నాడు. ఆడపిల్లలు ఇదివరకులా లెరుగా!!! చూపులతో ఇబ్బంది పెట్టినా, చేతలతో సమాధానం చెప్తారు అన్న భయం కావచ్చు. తిప్పలేని తన చూపు, మైనా మెడ మీదున్న పుట్టుమచ్చ మీద వాలింది. ఒక్కసారిగా ఒళ్లంతా జివ్వుమంది. 

ఆలోచనల లోంచి బయటికి వచ్చిన మైనా పుస్తకం తీసి చదువుకుంటుంది. ఒక పేజ్ నుండి ఇంకో పేజ్ తో పాటు తన తలని తిప్పుతుంటే, తన మెడ, ఎత్తైన కొండ చుట్టు మెలికలు తిరుగుతున్న సన్నటి పిల్ల నదిలా అనిపించింది.

తన ఆలోచనలకి అడ్డుకట్ట వేయాలనుకున్న గౌతమ్, కళ్లు మూసుకుని ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాడు. ‘అందం ఏమన్నా అంత గొప్పదా? నయనానందం పర్మనెంట్ కాదురారే‌….అయినా ఇన్ని దేశాలు తిరిగావు నువ్వు చూడని అందమా? ఎందుకురా ఇలా అయిపోతున్నావు?’ అని తనకి తాను చెప్పుకుంటుండగా, ఒక గొంతు వినిపించింది….’అమ్మో భయంగా ఉంది…నా చెవి!!! నా చెవి!!! వినిపించట్లేదు’ అని పానిక్ అవుతూ పక్క సీట్ లో ఉన్న ప్యాసింజర్….ఎయిర్ హోస్టెస్ కోసం స్విచ్ నొక్కడం స్టార్ట్ చేశాడు.

ఎయిర్ హోస్టెస్ బిజీగా ఉండడం వల్ల వెంటనే రలేకపోవడం చూసి ఇంకా కంగారు పడ్డాడు. ఈలోగా మైనా ఆయన దగ్గరికి వెళ్లి, ‘కంగారు పడకండి అంకుల్, మీ ముక్కుని కంప్లీట్ గా క్లోజ్ చేసి, గట్టిగా గాలిని ముక్కుతో బయటికి వదలడానికి ట్రై చేయండి….’ అని ధైర్యం చెప్పింది. ‘థాంక్స్ అమ్మ….ఇది నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ…ఒక్కసారిగా ఏమైందో తెలియదు చాలా భయమేసింది’ అంటూ నవ్వారు ఆయన.

‘ఏమి కాదు అంకుల్ జస్ట్ ఫ్లైట్ గాల్లో ఉండగా ప్రెజర్ డిఫరెన్స్ వల్ల మన చెవులు బ్లాక్ అవుతాయి అంతే!! అలాంటప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మామూలుగానే ఉంటుంది’ అని నవ్వుతూ వచ్చేసింది. అంతా అయిపోయాక, అత్తగారు వేలు పెట్టినట్టు ఎయిర్ హోస్టెస్ వచ్చి కొంచెం వాటర్ ఇచ్చింది. ఈ మాటలు అంతా విన్న గౌతమ్ ‘సచ్ ఎ బ్యూటీ విత్ బ్రెయిన్’ అని మురిసిపోయాడు. 

మైనా చదువుతున్న బుక్ వైపు చూసాడు, ‘after the storm by shinuka tzu’ అని రాసుంది. జపాన్ లో న్యూక్లియర్ దాడి తర్వాతి జపాన్ మళ్లీ ఎలా నిలబడి తట్టుకుంది అనే విషయం గురించి ఆ పుస్తకం. తనకున్న తెలివి ఇంకా స్వభావం ముందు, తన అందం, తన కాలి గోటికే….సరిపోదు అనిపించింది. తన గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపించింది.

‘హాయ్ దిస్ ఈజ్ గౌతమ్….మీ పేరు?’ చాలా క్యాజువల్ గా అడిగాడు.

‘నైస్ టు మీట్ యు బట్ అడిగిన వారందరికీ పేరు చెప్పడానికి నేను ఏమన్నా షాపింగ్ కాంప్లెక్స్ ఆ ?’ అంది మైనా. ఏమ్ పొగర్రా బాబు ….సర్లే , గోరంత అందాలకే కొండంత పొగరు ఉంటున్నప్పుడు కొండంత అందానికి ఎంతలే అనుకున్నాడు గౌతమ్.

‘ఈజీ…లేడీ నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. నువ్వు చదువుతున్న బుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సిమిలర్ టాపిక్ మీద నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఒక థీసిస్ రాసా. అందుకే మాట్లాడదాం అని పేరు అడిగా…లైట్’ అన్నాడు గౌతమ్.

ఇద్దరికీ చాలా కామన్ ఇంట్రెస్ట్ ఉండటం చూసి కొంచెం ఇంప్రెషన్ మారినట్టుంది, ‘హ్మ్ చూడటానికి చాలా తెలివైన వాడిలా ఉన్నావు నువ్వే పేరు కనిపెట్టొచ్చుగా’ అంది మైనా.

‘సరే ఏదన్నా క్లూ ఇవ్వు కనీసం’

‘నేను కూడా ఒక ఏరోప్లేన్ లాంటిదాన్నే….కాకపోతే వేరే భాషలో ఏమో…’ అంటూ నవ్వింది. చనిపోయేముందు కళ్లు మూసుకుంటే చివరిసారిగా జీవితాన్ని నెమరేసుకున్నప్పుడు కూడా అదే గుర్తువచ్చేలా ఉంది తన నవ్వు.

‘విమానం….పక్షి….పక్షిరాజు….’ అని నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు.

‘మహాప్రభు అసల ఆడపిల్లకు పెట్టే పేర్లు ఏనా అవి’ దండం పెడుతూ నవ్వింది.

‘ఇందాక ఆ అంకుల్ కి హెల్ప్ చేసినట్టు నాక్కూడా కొంచెం హెల్ప్ చేయచ్చుగా ….’

‘ఆహా…సరే విమానం లాంటిదానికి సంబంధించిన పేరు నాది…..’

‘విమానం లాంటిది అంటే విహంగం…..అంటే పక్షి…..’

‘దగ్గరికి వచ్చావ్….’

‘చిలకలా నవ్వావు అని చిలక అని పెట్టారా?’

‘చిలకా…..? ఏ కాలంలో ఉన్నావు బాబు’ అని తల పట్టుకుంది.

‘ఒక ఆడపిల్లకు పెట్టే పక్షి పేరు ఏముంది……మైనా ?’

‘థాంక్స్ నా పేరు ని ఇంకెంత ఖూనీ చేస్తావో అనుకున్నా. హాయ్ ఐ యామ్ మైనా’ అని చెయ్యి చాచింది.

గగనవీధిలో చాలా సేపే ముచ్చట్లు ఆడుకున్నారు. జపాన్ మీద జరిగిన న్యూక్లియర్ దాడి నుండి, అమెరికన్ డాలర్ కి ఇండియా లో బంగారం రేట్ కి ఉన్న సంబంధం వరకు, కాళిదాసు రాసిన మేఘసందేశం నుండి గౌతమ్ కి ఇష్టమైన జియోగ్రఫీ లో ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ వరకు, చాలా కబుర్లు చెప్పుకున్నారు.

సగం ప్రపంచాన్ని సింగిల్ గా చూసిన గౌతమ్, మిగిలిన ప్రపంచాన్ని తన లైఫ్ పార్ట్నర్ తో చూడటం తన బిగ్గెస్ట్ డ్రీమ్ అని చెప్పాడు. చేస్తున్న ఉద్యోగం నచ్చక కొత్తగా రెస్టారెంట్ పెట్టి ఆథెంటిక్ ఏషియన్ ఫుడ్ కోసం జపాన్ లో ఒక కుకింగ్ కోర్స్ లో జాయిన్ అయిందని చెప్పింది మైనా. 

ఇన్ని కబుర్లకి కచ్చితంగా ఇద్దరికీ ఒక అట్రాక్షన్ అయితే స్టార్ట్ అయింది. కానీ ఇంత తక్కువ కాలంలో ఒక గౌరవంతో కూడిన ఇష్టం వస్తుందని ఇద్దరు అనుకోలేదు. జపాన్ అంతా కలిసి చూద్దాం నాతో వస్తావా? అని అడగాలనిపించింది గౌతమ్ కి. తన గురించి ఇంకా ఇంకా తెలుసుకుంటే ప్రపంచం మొత్తం చూస్తాడు ఏమో. ఇద్దరు చెప్పలేని ఒకటే మాట…. ‘Can we see how it goes?’

వాష్‌రూమ్‌కి వెళ్లాలని లేచింది మైనా. వాష్రూమ్ లో ఉండగా బయట ఏవో మాటలు వినిపించడం మొదలు పెట్టాయి. మెల్లగా సౌండ్ పెరిగింది. వాష్‌రూమ్ డోర్ వాలుగా తెరిచి చూస్తే ఎయిర్ హోస్టెస్ తో గొడవ పడుతున్న ప్యాసింజర్ కనిపించాడు. గొడవ పెద్దది అయి ఆమె చేతిని పట్టుకుని తోశాడు. ఇంకొక ఎయిర్ హోస్టెస్ ఆపడానికి చూస్తే, తన చేతికి అందిన పెన్‌తో పొడవడానికి ట్రై చేస్తుండగా…మైనా వెనుక నుంచి వచ్చి ప్యాసింజర్ చెయ్యి పట్టుకుని ఆపడానికి చూసింది.

వెంటనే మైనా మేడ పట్టుకుని పక్కకి తోయడానికి చూశాడు. గౌతమ్‌తో సహా చుట్టు ఉన్నవాళ్లు ఆపేలోగా, సీట్ ఆర్మ్ రెస్ట్ మైనా మొహానికి తగిలి కళ్లు తిరిగి పడిపోయింది. ఈలోగా వచ్చిన కో-పైలట్ ప్యాసింజర్‌ని అదుపు చేసి మైనాకి ఫస్ట్-ఎయిడ్ చేశారు. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన వెంటనే మైనాని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.

ఇదంతా చూస్తూ షాక్‌లో ఉండిపోయాడు గౌతమ్. మైనా మైకంలో ఉన్నాసరే, తన చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చున్నాడు. ఇంత తక్కువ కాలంలో అంత ఇష్టం వచ్చిందా అంటే? ఏమో తనకి కూడా అర్ధం కాలేదు. ఇది ప్రేమ? తన దగ్గర సమాధానం లేదు…అసల ఏం నచ్చింది ఈ అమ్మాయిలో తనకి? పక్క వాళ్ళు కష్టంలో ఉంటే ఏం ఆలోచించకుండా తెగించి కాపాడే ధైర్యమా లేదా తనకున్న ధైర్యాన్ని కూడా పక్క వాళ్ళకి ఇవ్వగలిగిన  తత్వమా? నిద్రలో కూడా మురిపించే అందమా? జీవితం మొత్తం కబుర్లు చెప్పగలిగే తెలివా? దేనికీ సమాధానం లేదు. కానీ తన జీవితంలో ఆ అమ్మాయి ఉంటే బాగుంటుంది అని మాత్రం తెలుసు. తనతో ఈ ప్రపంచం మొత్తం చూడాలని తెలుసు.

రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ వచ్చారు. ‘Her life is out of danger…..’ అన్నారు. హమ్మయ్య అనుకునేలోగా ‘but…. Due to head injury she had severe concussions and తన చూపు….పోవచ్….’ ఇది చెవి నుంచి బుర్రకి వెళ్లేలోగ గౌతమ్ బుర్ర గిర్రున తిరిగింది. తన ఆశలన్నీ నీరు కారిపోయాయి అనిపించింది. తన నుంచి ఆనందం ఎవరో లాగేసుకుంటున్నట్టు ఉంది. కడుపంతా పీక్కుపోయింది . తనతో ప్రపంచం మొత్తం చూద్దాం అనుకున్నాడు కానీ ఇప్పుడు తనకి అసల ఈ ప్రపంచ్నాన్ని చూపగలడా? ఇష్టపడ్డ అమ్మాయి వెంటనే దూరం అయినందుకు దేవుడి మీద కోపం వచ్చింది.

మూడు గంటల్లో జీవితానికి సరిపడే ప్రేమ, ఆ ప్రేమని చెదిపేసే అంత బాధ రావచ్చా? ధైర్యం చేసి మైనా తోనే ఉండగలడా? లేదా ప్రాక్టికల్‌గా ఆలోచించి ఇదంతా జస్ట్ టెంపరరీ ఫీలింగ్స్ అని కొట్టిపడేసి ముందుకి వెళ్ళిపోవాలా? త్రిశంకు స్వర్గంలో వెలాడుతున్నాడు గౌతమ్!!!!


-----అనిమేష

No comments:

Post a Comment

ఎంతమాత్రమున ఎవ్వరు తలచినా.. అంతమాత్రమే నీవు….

( కురుక్షేత్ర   యుద్ధం   ముందు ,  దుర్యోధనుడు   ఇంకా   అర్జునుడు ,   కృష్ణుడి   సాయం   కోసం   తన   ఇంటికి   వెళ్తారు .  అర్జునుడుకృష్ణుడి   ...