EPISODE - 1
ఒక దర్శకుడు ఎప్పుడూ తనకి నచ్చిన విధంగానే సినిమాని తియ్యగలడు ..... జనాలందరికి నచ్చే విధంగా తను తియ్యలేడు ఎందుకంటే వాళ్ళకి ఏం నచ్చుతుందో ఈయనకి ఎలా తెలుస్తుంది?? అని రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు . అదే విధంగా ఒక రచయిత కూడా తనకి నచ్చిన విధంగానే రాయగలడు , జనాలందరికి నచ్చే విధంగా ఎలా రాయగలడు అని నమ్మే సాధారణ సగటు నిరుద్యోగ యువకుడు ఆర్య . "చిన్నప్పుడు ఏదో చీమో దోమో కథ రాసి , రచయిత అయిపోవాలని అన్ని పనులు మానేస్తారా ఎవరైనా ?" అని వాళ్ళ నాన్న చేత తిట్లు , ఎంతో ప్రేమగా ఎప్పటికైనా సరే వాళ్ళ అబ్బాయి , అనుకున్నది సాధిస్తాడు అని వెనకేసుకుని వచ్చే వాళ్ళ అమ్మ చేతితో అట్లు కూడా తింటాడు .
అస్సలు ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్న ఆనందం కోసం , తాను ఇష్టపడే అమ్మాయితో కాలం గడపడం కోసం ఇంజనీరింగ్ లో చేరాడు. జీవితంలో ఏమైనా పర్లేదు కానీ , బాగా చదివేసి తను మంచి మార్కులు తెచ్చేసుకుని ఇంటి చుట్టూ ఉండే పిల్లల్ని మాత్రం వాళ్ళ తల్లితండ్రులు " ఆర్యని చూసి నేర్చుకోండిరా " అని తిట్టించకుండా ఉంటే చాలు అని అనుకునేవాడు. అందుకే మనలా ఆన్లైన్ ఎగ్జామ్స్ లో కాకుండా కాలేజీ కి వెళ్లి రాసి ఒక మాదిరి మార్కులతో పాస్ అయ్యాడు . పాస్ అయ్యి సంవత్సరమైనా , ఉద్యోగం ఏమి చేయకుండానే ఇంట్లో ఉంటూ, ఎప్పటికైనా ఒక మంచి కథ రాయాలి అని అనుకుంటున్నాడు. వీటన్నిటికీ తోడుగా , ఉద్యోగం పేరుతో పెళ్లి వాయిదా వేస్తూ వాళ్ళ ప్రేమని కాపాడుకుంటూ వస్తున్నా ప్రేయసి . ఈ బాధల్లో "మా వాడు ఒక కథ రాస్తున్నాడు .... పేరేంటో తెలుసా? నా సావు నేను చస్తా మీకెందుకు " అని చమత్కారంగా ఆట పట్టించే ఒక తొట్టి గ్యాంగ్ లాంటి ఫ్రండ్స్.